ఎమ్మెల్యే రాచమల్లుకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించం: అసమ్మతి నేతలు - Meeting Against MLA Rachamallu - MEETING AGAINST MLA RACHAMALLU
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 24, 2024, 7:34 AM IST
|Updated : Mar 24, 2024, 9:25 AM IST
YSRCP Dissident Leaders Meeting Against MLA Rachamallu: సార్వత్రిక ఎన్నికల వేళ వైసీపీలో అసమ్మతి నేతల ఒక్కొక్కరుగా పుట్టగొడుగుల్లా బయటకు వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ ఐదేళ్లలో ఏ ఒక్క రోజూ నియోజకవర్గంలో తిరగని ఎమ్మెల్యేలకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వటంపై మండిపడుతున్నారు. సిట్టింగ్లకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించేదే లేదని స్పష్టం చేస్తున్నారు.
ఈ క్రమంలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు శివచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి పలువురు వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు హాజరయ్యారు. ఎమ్మెల్యే రాచమల్లుకు సార్వత్రిక ఎన్నికల్లో సహకరించేది లేదని అసమ్మతి నేతలు తెల్చిచెప్పారు. రాచమల్లు అరాచకాలకు ప్రజలు అంతం పలుకుతారని స్పష్టం చేశారు.
"ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాచమల్లు అరాచకాలతో ప్రజలు నానాఅగచాట్లు పడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను విమర్శించేందుకు కాకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము కంకణం కట్టుకున్నాం. ఈ నేపథ్యంలోనే సమావేశం ఏర్పాటు చేశాం. రానున్న ఎన్నికల్లో రాచమల్లుకు ఎట్టిపరిస్థితుల్లో సహకరించేదే లేదు. రాచమల్లు అరాచకాలకు ప్రజలే అంతం పలుకుతారు." - శివచంద్రారెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు
మరోవైపు శివచంద్రారెడ్డిని ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి సోదరుడు రాఘవరెడ్డి కలిశారు. కొర్రపాడు రోడ్డులో నిర్వహించిన కార్యక్రమం అనంతరం రాఘవరెడ్డి ఎమ్మెల్యే అసమ్మతి నేతలను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీకి మద్దతు తెలపాలని ఆయన శివచంద్రారెడ్డిని కోరారు.
దీంతో త్వరలోనే మరోసారి తన అనుచరులు, నాయకులతో చర్చించి నిర్ణయాన్ని తెలియజేస్తామని శివచంద్రారెడ్డి స్పష్టం చేశారు. గత కొన్నిరోజుల నుంచి శివచంద్రారెడ్డి, మరికొందరు కౌన్సిలర్లు ఎమ్మెల్యే రాచమల్లుకు వ్యతిరేకంగా గళం వినిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాఘవరెడ్డి వారిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.