జనసేనకు ప్రచారం చేశాడని కారు దహనం- కొనసాగుతున్న వైఎస్సార్సీపీ అరాచకం - YSRCP Activists Set Fire to Car
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 27, 2024, 1:15 PM IST
YSRCP Activists Set Fire to Janasena Leader Car: రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడే సమయం ఆసన్నమైనా వైఎస్సార్సీపీ నాయకుల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు అరాచకం సృష్టించారు. జనసేన నాయకుడు కర్రి మహేశ్ కారుకు నిప్పుపెట్టారు. ఇంటి ముందు ఉన్న కారును తగలబెట్టిన తీరుపై కర్రి మహేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. కారు దహనం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం చేసినందునే ఇలా చేశారని ఆరోపించారు.
పవన్ కల్యాణ్ కోసం పనిచేయడాన్ని తట్టుకోలేక దుశ్చర్యకు పాల్పడ్డారని వాపోయారు. జగన్మోహన్ రెడ్డి ని మాత్రమే అభిమానించాలనే శాసనం ఏమైనా ఉందా అని నిలదీశారు. గతంలోనూ అర్ధరాత్రి వచ్చి తమ ఇంటిపై దాడి చేశారని తెలిపారు. ఆ మంటలు ఇంటి గోడ వైపు వ్యాపించాయని వంట గది అటే ఉంది ప్రమాదం జరిగితే మా కుటుంబం మొత్తం చనిపోయేవాళ్లమని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల ఉదాసీన వైఖరి వల్లే వైఎస్సార్సీపీ మూకలు రెచ్చిపోతున్నాయని మహేశ్ అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్పీని కోరారు.