ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోతుంటే మంత్రి సంక్రాంతి డ్యాన్సులు చేస్తున్నారు: షర్మిల - ysrcp
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 27, 2024, 1:21 PM IST
YS Sharmila Comments: ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కోట్టుకు పోయాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని షర్మిల మండిపడ్డారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కందుల ఓబుల రెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్టును కాంగ్రెస్ నాయకులతో కలిసి షర్మిల పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిర్వహణ కోసం నిధులు మంజూరు చేయలేదని, అందుకే రెగ్యులేటర్ మరమ్మతులు గురైందని పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వానికి ప్రాజెక్టుల పట్ల ఇంత నిర్లక్ష్యం తగదని, నీటిపారుదల శాఖ మంత్రి సంక్రాంతికి డ్యాన్సులు చేయడం తప్ప ప్రాజెక్టుల బాగోగులను చూడటం మానేశారని విమర్శించారు. ప్రభుత్వం ఏమాత్రం ప్రాజెక్టును పట్టించుకున్నా ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితి వచ్చేది కాదని ధ్వజమెత్తారు.
ప్రాజెక్టు మరమ్మతులు చేసేందుకు జగనన్నకు మనసు రావట్లేదని అన్నారు. వైఎస్ కట్టిన ప్రాజెక్టు పట్టించుకోని వాళ్లు వైఎస్ వారసులా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలని. లేకుంటే ప్రాజెక్ట్ కూలిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. రూ.10 కోట్లు ఇస్తే ప్రాజెక్టు నిలబడుతుందని, ప్రాజెక్టు కింద వేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని మండిపడ్డారు. కనీసం ఇప్పటికైనా రైతుల ప్రయోజనం దృష్ట్యా గుండ్లకమ్మ ప్రాజెక్టును కాపాడాలని షర్మిల కోరారు.