ఉద్రిక్తతల మధ్య ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్‌పై వీగిన అవిశ్వాసం - No Confidence defeated in Yellandu
Published : Feb 5, 2024, 2:15 PM IST
Yellandu Muncipality No Confidence Motion : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు పురపాలక కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇల్లందు పురపాలికలో అవిశ్వాస తీర్మానం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ టెన్షన్ల మధ్యే ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్ డీవీపై అవిశ్వాసం వీగిపోయింది. మొత్తం 24 మంది సభ్యుల్లో అవిశ్వాసం నెగ్గేందుకు 17 మంది సభ్యులు కావాల్సి ఉండగా, నిర్ణీత సమయానికి సమావేశంలో 15 మంది సభ్యులు పాల్గొనడంతో అవిశ్వాసం వీగిపోయింది.
అంతకుముందు మున్సిపల్ ఛైర్మన్‌పై అవిశ్వాసం కోసం పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ నేపథ్యంలో అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడానికి 17 మంది కౌన్సిలర్లు వచ్చారు. వారిలో కౌన్సిలర్ నాగేశ్వర్‌రావును కాంగ్రెస్ నేతలు బలవంతంగా తీసుకెళ్లారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. నాగేశ్వర్‌రావును ఎమ్మెల్యే కోరం కనకయ్య బలవంతంగా తీసుకెళ్లారని ఆందోళనకు దిగారు.
మరోవైపు సీపీఐ కౌన్సిలర్‌ను ఆ పార్టీ నేతలు తమ వెంట తీసుకెళ్లారని గులాబీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. అవిశ్వాసం కోరుతూ సమావేశంలో పాల్గొన్న 17 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్నారు. మరో ఇద్దరు కౌన్సిలర్లు మద్దతు తెలిపితే అవిశ్వాసం వీగిపోనున్న నేపథ్యంలో ఇద్దరు కౌన్సిలర్లను అటు కాంగ్రెస్, ఇటు సీపీఐ నేతలు తీసుకువెళ్లారని గులాబీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో మున్సిపల్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు భారీగా మోహరించారు. మరోవైపు మున్సిపల్ కార్యాలయంలో నాగేశ్వర్‌రావు భార్య ఆందోళనకు దిగారు. భర్తను చూపించాలని కార్యాలయం గేటు ముందు ఆమె బైఠాయించారు.