నేడు యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి కల్యాణం - సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఆలయం - Yadadri Narasimha Swamy Kalyanam
Published : Mar 18, 2024, 12:34 PM IST
Yadadri Sri Lakshmi Narasimha Swamy Kalyanam 2024 : తెలంగాణలో మరో తిరుమలగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామి అమ్మవార్ల తిరు కల్యాణ మహోత్సవాన్ని ఈరోజు రాత్రి 8.45 గంటలకు అర్చకులు వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయ తిరు మాడ వీధిలో తిరు కల్యాణ మహోత్సవం జరపనున్నారు.
Yadadri Varshika Bramhotsavam 2024 : ఇందుకోసం ఆలయం ఉత్తరము ముఖముగా గల మాడ వీధిలోని కొండపై అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ పరిసరాలను వివిధ రకాల పూలతో, విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. సాయంత్రం స్వామివారి కల్యాణం సందర్బంగా పోలీసులు భద్రతను పెంచారు. దాదాపు 10 వేల మంది భక్తులు కల్యాణాన్ని తిలకించేలా స్థలాన్ని సిద్ధం చేశారు. వీఐపీలు, వీవీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మీడియా కవరేజీ కోసం ప్రత్యేక గ్యాలరీ సిద్ధంగా ఉంచారు. భక్తులు వీక్షించేందుకు ఆలయ పరిసరాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.