పుదుచ్చేరిలో మెుదలైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ - 6 వరకు జరగనున్న ప్రక్రియ - voting start for old people and phc
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 2, 2024, 10:16 PM IST
Voting Start for Old People and PHC Candidates in Puducherry : రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న పుదుచ్చేరిలో ఈరోజు నుంచి ఎన్నికల పోలింగ్ మెుదలైంది. కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరి ఏకైక పార్లమెంటు స్థానానికి ఈనెల 19న మెుదటి దశలోనే పోలింగ్ జరగనుంది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు కేెంద్రఎన్నికల కమిషన్ 85 సంత్సరాలు దాటిన వృద్దులు, దివ్యాంగులకు ఇంటి వద్ద నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ 2 నుంచి 6 వరకు వృద్దులు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ పద్దతి ద్వారా ఓటింగ్ జరుగుతుంది. ఈ ఓటింగ్ ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.
పుదిచ్చేరి పార్లమెంట్ పరిధిలో మెుత్తం వృద్ధులు, దివ్యాంగులు కలిపి 977 మంది ఉండగా కేవలం 302 మంది మాత్రమే ఇంటి నుంచి ఓటు వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరు ఓటు వేసే విధంగా యానం అసెంబ్లీ సెగ్మెంట్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మునిస్వామి పర్యవేక్షణలో ఐదు జోన్లను ఏర్పాటుచేశారు. ప్రతి జోన్లో ఒక మైక్రో అబ్జర్వర్, పోలింగ్ ఆఫీసర్, ఇద్దరు సాయుధ పోలీసులు, ఒక సాధారణ పోలీసు, ఇద్దరు ఎన్నికల సిబ్బంది ఉంటారు. వీరందరూ ఓటింగ్ కంపార్ట్మెంట్, బ్యాలెట్ బాక్స్‌తో ఓటరు ఇంటి వద్దకే వెళ్లి ఓటు వేయించే కార్యక్రమాన్ని ఈరోజు నుంచే ప్రారంభించారు.