సర్పంచ్ ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణా - నిత్యం వందలాదిగా ట్రాక్టర్లు - Villagers Protest on Sand Mining - VILLAGERS PROTEST ON SAND MINING
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 10, 2024, 7:34 PM IST
Sand Mining in Bhairavapalem: అధికార పార్టీ నేతల ఇసుక దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. సహజవనరుల దోపిడీలో పార్టీ పెద్దలను ఆదర్శంగా తీసుకున్న వైసీపీ సర్పంచ్, కార్యకర్తలు, గత కొద్దిరోజులుగా ఆ ప్రాంతంలో ఇసుక దందాకు తెరలేపారు. అనుకున్నదే తడువుగా, రాత్రి పగలు తేడా లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తూ కోట్లు కొల్లగొడుతున్న ఘటన డా.బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం భైరవపాలెంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే, కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం బైరవపాలెంలో వైసీపీ నాయకులు ఇసుకను యథేచ్చగా దోచేస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. నదీ పరీవాహక ప్రాంతంలోని ఇసుకను వైసీపీ సర్పంచ్ , ఆ పార్టీ కార్యకర్తలు తరలిస్తున్నారన్నారు. ఇటీవల ఓఎన్జీసీ పైపులైను కొరకు గోదావరిలో డ్రెడ్జింగ్ చేసిన ఇసుకను సైతం, అక్రమంగా ప్రొక్లైన్ తో తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా రోజూ వందలాది ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారని గ్రామస్థులు మండిపడ్డారు. ఇసుకాసురులను ప్రశ్నించిన వారిపై శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.