YS Sharmila Fires on Amit Shah : గాంధీని చంపిన వ్యక్తికి బీజేపీ గుడులు కట్టి పూజిస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అంబేద్కర్‌ను అవహేళన చేసి కనీసం క్షమాపణ చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమలం పార్టీ తక్షణమే క్షమాపణ చెప్పాలని, అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో నిర్వహించిన జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ పేరిట రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
దీనిపై అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రపతికి తీర్మానం చేసి పంపుదామని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. మరోవైపు కులగణన చేపట్టకుండా బీజేపీ అడ్డుపడుతోందని ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తోందని గణన వద్దని అంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలోనూ బీజేపీ గులాం గిరీ జరుగుతోందని వైఎస్ షర్మిల దుయ్యబట్టారు.
"గాంధీని చంపిన వ్యక్తికి బీజేపీ గుడులు కట్టి పూజిస్తోంది. అంబేద్కర్‌ను అవహేళన చేసి క్షమాపణ చెప్పటం లేదు. అమిత్ షా క్షమాపణ చెప్పాలి. అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రపతికి తీర్మానం చేసి పంపుదాం. రాష్ట్రంలోనూ బీజేపీ గులాం గిరీ జరుగుతోంది." - వైఎస్ షర్మిల, ఏపీసీసీ అధ్యక్షురాలు
Amit Shah over Ambedkar Remarks : సాక్షాత్తూ పార్లమెంట్లో అంబేద్కర్‌పై హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖలు దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేశాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. దీనిపై హోం మంత్రి రాజీనామా చేసే వరకూ దేశవ్యాప్త పోరాటం చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. మహాత్మా గాంధీ చనిపోయే వరకూ ఎవరికి తలవంచని వ్యక్తి అని గుర్తుచేశారు. అంబేద్కర్ రాజ్యాంగం వల్లే సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఆ పదవుల్లో ఉన్నారని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాజ్యాంగ నిర్మాతను అవమానిస్తే ఎవరూ మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ విషయంపై కనీసం స్పందిచని వారు ఆ పదవుల్లో కొనసాగడం అవసరమా అని రామకృష్ణ నిలదీశారు. ఈ సమావేశంలో సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్.బాబురావు, ఇతర నేతలు పాల్గొన్నారు.