Pandem Kodi Punjulu Ready to Competition for Sankranti: సంక్రాంతి అనగానే పల్లెల పచ్చందాలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, బసవన్నలు, పిండివంటలు ఇలా ఎన్ని ఉన్నా కోడి పందేలది మాత్రం ప్రత్యేక స్థానం. వారూ వీరూ అనే తేడా లేకుండా అందరి చూపూ వాటి పైనే ఉంటుంది. ఈ క్రమంలో సంక్రాంతి బరిలో కాలుదువ్వేందుకు పందెంకోళ్లు సై అంటున్నాయి. బరిలే నిలిచేందుకు కొన్ని నెలల పాటు ప్రత్యేక శిక్షణ పొంది, రాటుదేలిన కోళ్లు తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. మూడు రోజుల వేడుకలో ప్రత్యేకంగా నిలిచే కోడిపందేలను భారీగా నిర్వహించేందుకు బెట్టింగ్ బాబులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.
డ్రైప్రూట్స్‌తో పాటు ప్రత్యేక ఆహారం: కృష్ణా జిల్లాల్లో పెద్ద పండుగ సమరానికి కసరత్తు మొదలైంది. పండుగను పురస్కరించుకుని జిల్లాలో అనేక ప్రాంతాల్లో పందెం కోళ్లను పెంచుతున్నారు. పామర్రు, పెనమలూరు, గుడివాడ, అవనిగడ్డ ఈ నియోజకవర్గాల్లో పందెం కోళ్ల పెంపకం అధికంగా జరుగుతోంది. ప్రత్యేకంగా షెడ్లను ఏర్పాటు చేసి కోళ్లను పెంచుతున్నారు. కోడి పందేనికి సిద్ధం చేసే ఒక్కో పుంజు కోసం దాదాపు 30 వేల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. పందెంలో బలంగా పోరాడేందుకు కోళ్లకు డ్రైప్రూట్స్‌తో పాటు ప్రత్యేక ఆహారాన్ని అందిస్తామని పెంపకందారులు చెబుతున్నారు. కోళ్లను కోనుగోలు చేసేందుకు ఉమ్మడి గోదావరి, గుంటూరు జిల్లాల నుంచి వస్తుంటారని అన్నారు.
కాలు దువ్వుతున్న కోళ్లు - అనుమతులు లేవంటున్న పోలీసులు
పందెం కోళ్లను కొనేందుకు ఉత్సాహం: బరిలో పందెం గెలిచేందుకు అధిక ధరలు వెచ్చించైనా కోళ్లను కొనుగోలు చేసేందుకు బెట్టింగ్ బాబులు వెనుకడుకు వేయడం లేదు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహించిన సంతలో పందెం కోళ్లను కొనుగోలు చేసేందుకు బెట్టింగ్ బాబులు ఉత్సాహం చూపారు. ఒక్కొ పుంజుకు 5 వేల రూపాయల నుంచి 15 వేల వరకు ఖర్చుపెట్టి కొనుగోలు చేశారు. కొనుగోలుదారులు, అమ్మకందారులతో సంతప్రాంతంలో సందడి నెలకొంది.
పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు: నిబంధనలకు విరుద్ధంగా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ కే.ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గణపవరం ఎస్సై మణికుమార్ ఆధ్వర్యంలో రామచంద్రపురంలో కోడి కత్తులు తయారు చేస్తున్న ముసినాని బ్రహ్మానందం అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తులను అదుపులోకి తీసుకుని.. వారి నుంచి 1300 కోడి కత్తులు, పదును పెట్టే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కోడిపందేలు, రికార్డింగ్ డాన్సులు - ఎక్కడెక్కడ ఏమేం స్పెషల్ అంటే!