479 నర్సింగ్ పోస్టులకు టీటీడీ ఆమోదం - TTD Key Decisions
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 11, 2024, 8:32 PM IST
TTD Board of Trustees Meeting: తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో రోగుల సంఖ్య పెరగడంతో అదనంగా 479 నర్సింగ్ పోస్టులు ఆమోదిస్తూ టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (TTD Chairman Bhumana Karunakar Reddy) తెలిపారు. దీంతోపాటు నిర్వహణలో ఉన్న అన్ని కళాశాలల్లో అదనంగా హాస్టళ్ల నిర్మాణం చేయాలని మండలి ఆమోదం తెలిపిందన్నారు. అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశాన్ని భూమన నిర్వహించారు.
తిరుమలలో యాత్రికుల సముదాయాలల్లో 10 లిఫ్ట్‌ల ఏర్పాటు కోసం కోటి 88 లక్షల రూపాయలు, బాలాజీ నగర్ అటవీ ప్రాంతంలో మిగిలిన ఫెన్సింగ్ నిర్మాణం కోసం కోటి యాబై లక్షలు, టీటీడీ ఉద్యోగుల క్వార్టర్స్ మరమ్మతుల కోసం 14 కోట్ల రూపాయలు ఆమోదించినట్లు వివరించారు. ఇటీవల మొదటి ఘాట్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఆలయ పరిచారకులు యతి రాజన్ నరసింహ కుటుంబానికి 5 లక్షలు నష్ట పరిహారం ప్రకటించారు. టీటీడీ 3 డేటా సెంటర్ల నిర్వహణకు 12 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు.