ప్రభుత్వ భూమి ఆక్రమణకు యత్నం - అడ్డుకున్న టీడీపీ మహిళా నేతలు - TDP Womens Stop Land Encroachment - TDP WOMENS STOP LAND ENCROACHMENT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 13, 2024, 4:20 PM IST
TDP Women Leaders Prevent Land Encroachment in Atmakur : ఖాళీ ప్రభుత్వ స్థలాలు కనిపిస్తే చాలు కొందరు వాటిని ఆక్రమించి అమ్ముకునేందుకు చూస్తుంటారు. అలాంటి సంఘటనే నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగింది. ఆత్మకూరులో 15వ వార్డు పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు కొందరు వ్యక్తులు యత్నించగా వారిని స్థానిక టీడీపీ మహిళా నాయకులు అడ్డుకున్నారు. వార్డు పరిధిలోని తిప్ప పోరంబోకు భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టి ఆ ప్రదేశాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకునేందుకు కొందరు యత్నించారు.
వాళ్లు అక్కడికి భారీ యంత్రాలను తీసుకువచ్చి ఆ ప్రదేశాన్ని చదును చేస్తుండగా స్థానిక టీడీపీ నాయకురాలు పులిమి శైలజా రెడ్డి స్థానిక మహిళలతో కలిసి అడ్డుకున్నారు. వెంటనే స్థానిక మున్సిపల్ కమిషనర్‌కు ఈ విషయంపై సమాచారం అందించారు. దీంతో జేసీబీ, ఇతర వాహనదారులను అడ్డుకొని అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం స్థానికులతో కలిసి మున్సిపల్ కమిషనర్, మండల తహసీల్దార్‌కు స్థల ఆక్రమణలపై ఫిర్యాదు చేశారు.