రాబోయో ఎన్నికల్లో జగన్‌కు రాజకీయ సమాధి కడతారు: బూర్ల రామాంజనేయులు - Attacks on media in AP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 21, 2024, 10:34 PM IST
TDP Leaders Protested Against Attacks on Journalists: ముఖ్యమంత్రి జగన్‌కి పత్రికలంటే వణుకు పుడుతుందని అందుకే పత్రికా విలేకరులపై దాడులు చేసేందుకు జగన్ ప్రోత్సహిస్తున్నారని టీడీపీ నేత బూర్ల రామాంజనేయులు అన్నారు. పత్రికలపై జరుగుతున్న దాడులకు నిరసనగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. జగన్‌కి ఓటమి భయం పట్టుకుని ప్రజా గొంతుకగా ఉన్న పత్రికలు, చానల్స్ విలేకరులపై వైసీపీ దాడులకు పాల్పడుతోందన్నారు.
పత్రికలపై దాడి ప్రజాస్వామ్యం సమాధికి నిదర్శనమన్నారు. పత్రిక యాజమాన్యంపై కూడా దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. రామోజీరావు చరిత్ర ప్రపంచానికి తెలుసని, నీతి నిజాయతీలకు ఆయన నిలువెత్తు సాక్ష్యంగా నిలిచారన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవి 5 ఛానెల్స్ ప్రజా గొంతుకగా ఉన్నాయనీ అందుకే వాటిపై వివక్ష చూపుతూ దాడులు చేస్తున్నారన్నారు. 30 ఏళ్లకుపైగా మార్గదర్శి ప్రజలకు ఆర్ధికంగా అండగా నిలిచిందన్నారు. మార్గదర్శిలో ఎలాంటి అవకతవకలు జరగకపోయినా అక్రమ కేసులు పెట్టారనీ, కోర్టులు చివాట్లు పెట్టినా జగన్ బుద్ధి మారడం లేదన్నరు. ప్రజలు జగన్‌కి రాజకీయ సమాధి చేయడం ఖాయమన్నారు.