పోస్టల్ బ్యాలెట్ అంశంపై వైఎస్సార్సీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు: టీడీపీ - TDP leader Kishore Kumar Reddy - TDP LEADER KISHORE KUMAR REDDY
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 1, 2024, 5:13 PM IST
AP postal ballot votes: ఓడిపోతామన్న భయంతోనే పోస్టల్ బ్యాలెట్ అంశంపై వైఎస్సార్సీపీ నేతలు కుట్రలు, కుతంత్రాలు మొదలు పెట్టారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అన్నమయ్య జిల్లా కలికిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ నేతలపై నిప్పులు చెరిగారు.
ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ (YSRCP) నాయకులు కోర్టుకు వెళ్లడం సిగ్గు చేటని కిషోర్ కుమార్ మండిపడ్డారు. ఉద్యోగుల ఓట్లు చెల్లుబాటు కాకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ( CM Jagan Mohan Reddy ) భారతదేశంలో చిరస్ధాయిగా నిలిచిపోతారని నల్లారి ఎద్దేవా చేశారు. ఓట్లు చెల్లుబాటు కాకూడదని ఎప్పుడైతే కోర్టుకు వెళ్ళారో అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభంజనం సృష్టిస్తుందని తెలిపారు. జూన్ 4వ తేదీన టీడీపీ 150సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయం అని పేర్కొన్నారు.