జనజాతరలా బొప్పూడి సభ - దారులన్నీ ప్రజాగళం వైపే - TDP Janasena BJP Praja Galam
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 17, 2024, 5:29 PM IST
TDP Janasena BJP Public Meeting in Boppudi : ప్రజాగళం సభకు తెలుగుదేశం, జనసేన, భాజపా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దారులన్నీ ప్రజాగళం వైపే అన్నట్లుగా పల్నాడు జిల్లా బొప్పూడికి అభిమానులు, కార్యకర్తలు క్యూ కట్టారు. బస్సులు, ఆటోలు, ట్రాక్టర్లు, కారులు, బైక్ లపై ప్రజలు స్వచ్ఛద్ధంగా తరలివెళ్తున్నారు. మహిళలు సైతం భారీగా తరలివస్తున్నారు. వాహనాలకు జెండాలు కట్టి ర్యాలీలు చేస్తూ సైకో పాలన పోవాలి కూటమి పాలన రావాలంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
అయితే చరిత్రలో నిలిచేలా చరిత్రను తిరగరాసేలా తెలుగుదేశ-జనసేన-బీజేపీ కూటమి తొలి బహిరంగ సభ ముస్తాబైంది. రాష్ట్ర రాజకీయ చరిత్రగతినే మార్చేసే కీలక ఘట్టం బొప్పూడి వద్ద ఆవిష్కృతం కానుంది. వైసీపీ ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకు మూడు పార్టీలు చిలకలూరిపేట వేదికగా యుద్ధభేరి మోగించనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పదేళ్ల తర్వాత ఒకే వేదికపైకి రానున్నారు. ఇక్కడి నుంచే సార్వత్రిక సమరానికి ఆ త్రిమూర్తులు ఒకే వేదికపై నుంచి శంఖారావం పూరించనున్నారు.