కారు ఇంజిన్‌లో మంటలు - చూస్తుండగానే పూర్తిగా దగ్ధం - తప్పిన ప్రాణనష్టం - FIRE ACCIDENTS IN NALGONDA - FIRE ACCIDENTS IN NALGONDA
Published : Sep 20, 2024, 1:03 PM IST
Fire Accident in Nalgonda : నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కొత్తగూడెం వద్ద అద్దంకి - నార్కట్‌పల్లి రహదారిపై ప్రయాణిస్తున్న కారులో అగ్నిప్రమాదం జరిగింది. కారు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు కారు మొత్తానికి వ్యాపించాయి. కారులో ఉన్న వ్యక్తి మంటలను గమనించి వాహనాన్ని పక్కకు ఆపి దిగే క్రమంలో దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్పృహ కోల్పోయాడు. గమనించిన తోటి ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి కారులో ఉన్న వ్యక్తిని బయటకు తీశారు.
గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తృటిలో ప్రాణాపాయం తప్పగా, కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈమధ్య కాలంలో తరచుగా జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రయాణ సమయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.