విద్యార్థినులపై కండక్టర్ తిట్లపురాణం! డిపో ముందు చిన్నారుల నిరసన - Students Protest In RTC Bus Depot
Published : Aug 14, 2024, 10:14 PM IST
Students Protest In Front Of Shadnagar RTC Bus Depot : చదువుల కోసం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్న విద్యార్థినుల పట్ల ఆర్టీసీ బస్సు కండక్టర్ దురుసుగా, పరుషంగా ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ షాద్ నగర్ బస్ డిపో ఎదుట విద్యార్థులు ధర్నాకు దిగారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నుంచి కేశంపేట మండలంలోని సంగెం గ్రామానికి ఉదయం, సాయంత్రం వేళల్లో ఆర్టీసీ బస్సు నడుస్తోంది. ఈ బస్సులో పరిసర గ్రామాల నుంచి విద్యార్థి, విద్యార్థినిలు షాద్‌నగర్ పట్టణంలోని విద్యాసంస్థల్లో చదువుకోవడానికి రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఈ బస్సులో ఉండే కండక్టర్ రాములు విద్యార్ధినుల పట్ల పరుషంగా మాట్లాడుతూ, అసభ్య పదజాలంతో తిడుతూ ఉంటారని విద్యార్థినులు అవేదన వ్యక్తం చేశారు.
ఆధార్ అప్ డేట్ లేకపోయినా, ఆధార్ చూపించడం ఆలస్యమైనా దూషిస్తూ మధ్యలో బస్‌ను ఆపి కిందకు దింపేస్తున్నాడని వాపోయారు. కండక్టర్ తీరుపై ఆగ్రహించిన విద్యార్థినుల తల్లిదండ్రులు ఇవాళ సంగెం వద్ద బస్సు ముందు వెళ్లకుండా ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు బస్సును పంపించాలని కోరారు. దీంతో అదే బస్సులో షాద్ నగర్ డిపో వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. తమను అసభ్య పదజాలంతో ఇబ్బందులకు గురిచేస్తున్న కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు.