మా పొట్ట కొట్టకండి - ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ పీఎస్ ముందు చిరువ్యాపారుల నిరసన
Published : Oct 8, 2024, 5:19 PM IST
Ameerpet Street Vendors in Police Station : షాపింగ్ మాల్స్ ముందు వాహనాలు ఆగి ట్రాఫిక్ జామ్ అయితే పట్టించుకోకుండా తమలాంటి చిరు వ్యాపారులను ఎందుకు వేధిస్తున్నారంటూ ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ పీఎస్ ముందు వ్యాపారులు ఆందోళనకు దిగారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వల్లే అమీర్ పేట ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ జరుగుతోందని వారు ఆరోపించారు. తాము రోడ్డు పక్కన పూలు, పండ్లు, కూరగాయాలు, పూజకు సంబంధించిన సామాగ్రి అమ్ముకుంటూ జీవిస్తుంటే ట్రాఫిక్కు ఆటంకం కలిగిస్తున్నారని తమ సామాన్లను ట్రాఫిక్ పోలీసులు లాక్కెళ్లుతున్నారని వాపోయారు.
అమీర్పేట్లో తమ లాంటి వ్యాపారులు 200 కుటుంబాల వరకు ఇలా చిరు వ్యాపారం పైనే ఆధారపడుతున్నామని తెలిపారు. పార్కింగ్ సౌకర్యం లేక ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని ఆ విషయంపై దృష్టి సారించకుండా తమ సామాన్లు లాక్కొంటూ తమ పొట్ట కొడుతున్నారని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనుంచైనా తమను వేధించకుండా ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించాలని వారు ట్రాఫిక్ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.