పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం- అందాలు చూడతరమా! - Bogatha Waterfalls Mulugu - BOGATHA WATERFALLS MULUGU
Published : Jun 19, 2024, 8:31 PM IST
Bogatha Waterfalls Mulugu : ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామ సమీపంలోని బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షానికి జలకళ సంతరించుకుంది. 50 అడుగుల ఎత్తు నుంచి పాలనురగలా దిగువకు ప్రవహిస్తున్న నీళ్లను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. జలపాతం ప్రకృతి రమణీయత అందరినీ ఆకర్షిస్తోంది. దట్టమైన అడవి మార్గం గుండా ప్రవహిస్తూ వస్తున్న జలపాతం అందాలను చూసి టూరిస్ట్‌లు మురిసిపోతున్నారు.
వరంగల్‌కు 133 కి.మీ దూరంలో ఉన్న ఈ సహజసిద్ధ జలపాతాన్ని చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు ప్రతీ ఏటా తరలివస్తుంటారు. మరోవైపు యాత్రికులకు సౌకర్యంగా ఉండేందుకు జలపాతం వద్ద అటవీశాఖ అధికారులు ఇప్పటికే స్నాన ఘట్టాలు ఏర్పాటు చేశారు. అక్కడ స్నానాలు చేస్తూ పర్యాటకులు జలపాతాన్ని చూస్తూ సందడి చేస్తున్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో పరిసరాలు కోలాహలంగా మారాయి. కొత్త అందాలతో తెలంగాణ నయాగారా చూపరులకు కనువిందు చేస్తోంది.