వరంగల్లోని భద్రకాళి ఆలయంలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు - SHARANNAVARATRI AT BHADRAKALI
Published : Oct 2, 2024, 1:17 PM IST
Bhadrakali Temple in Warangal: వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు జరిగే ఉత్సవాలలో అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ధ్వజారోహణంతో మొదలయ్యే శరన్నవరాత్రి ఉత్సవాలు, తెప్పోత్సవంతో ముగుస్తాయని ఆలయ కార్యనిర్వాహక అధికారి శేషు భారతి తెలిపారు. మహలయ అమావాస్య సందర్భంగా అమ్మవారికి అర్చకులు పంచామృతాలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని పసుపుతో అలంకరించారు.
పసుపుతో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు. ప్రతి ఏటా మహాలయ అమావాస్య రోజు పసుపు వర్ణంతో అలంకరించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ ప్రధాన అర్చకుడు నాగరాజు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లతో పాటు తాగునీటి సౌకర్యాన్ని కల్పించినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం గాను ఉచిత అన్నదాన కార్యక్రమం చేయనున్నారు. దసరా రోజు శమీ పూజతో పాటు వాహనాల పూజ కోసం వచ్చే వాహనాల కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు.