మోగిన బడి గంట- విద్యార్థులు, టీచర్లతో పాఠశాలల వద్ద సందడి - SCHOOLS START - SCHOOLS START
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 13, 2024, 4:35 PM IST
Schools Open in Andhra Pradesh: రాష్ట్రంలో వేసవి సెలవులు ముగియడంతో బడి గంట మోగింది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఇన్ని రోజులూ వేసవి సెలవుల్లో ఆడుతూ పాడుతూ గడిపేసిన విద్యార్థులు బడిబాట పట్టారు. విద్యార్థులు, టీచర్ల రాకతో కర్నూలులో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సందడిగా మారాయి. చాలా రోజుల తర్వాత మిత్రులను కలుసుకోవడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల రాకతో పాఠశాలల వద్ద సందడి వాతావరణం నెలకొంది. పిల్లలకు అవసరమైన పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, క్యారీ బ్యాగులు, స్కూల్ బ్యాగులు, కొత్త దుస్తులు, బూట్లు ఇతర సామగ్రి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. నంద్యాలలోని పలు దుకాణాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కిటకిటలాడాయి. కొత్త పుస్తకాలు, వస్తువులు కొన్న ఆనందంలో పిల్లలు ఉబ్బితబ్బిబ్బవుతుంటే మరోవైపు పెద్దలు ఖాళీ అయిన జేబులను చూసుకుంటూ ఇంటి ముఖం పట్టారు.
మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 12 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉండడంతో బడులు తెరవడాన్ని అధికారులు ఒక రోజు వాయిదా వేశారు. ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో మండల కేంద్రాలకు చేరగా విద్యార్థి కిట్ల సామగ్రి కొంత వరకే వచ్చింది. బ్యాగులు, బెల్టులు, బూట్లు, ఏకరూప దుస్తులను గుత్తేదార్లు సరఫరా చేసినవి చేసినట్లుగా విద్యార్థులకు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.