ఇకపై ప్రతి పనిలో మహిళా సంఘాలకు చేయూత : సందీప్ కుమార్ సుల్తానియా - PR Dept Secretary Visit - PR DEPT SECRETARY VISIT
Published : May 30, 2024, 7:50 PM IST
PR Dept Secretary Inspection AT Suryapet Dist : సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలంలో మహిళా స్వశక్తి కుట్టు కేంద్రాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఏకరూప దుస్తులు అందించే లక్ష్యంతో 70 లక్షల యూనిఫామ్లు కుట్టిస్తున్నామని చెప్పారు. ఏకరూప దుస్తుల కుట్టు బాధ్యతలను మహిళా స్వశక్తి కేంద్రాలకు అప్పగించామని వెల్లడించారు.
అన్ని జిల్లాల్లో 45 రోజుల్లో మహిళా స్వశక్తి కుట్టు కేంద్రాల ద్వారా నాణ్యమైన దుస్తులు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. గతంలో దుస్తులు ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం జరిగేదన్నారు. సంఘాల ఆధ్వర్యంలో కుట్టు కేంద్రాల్లో ఒక్కో మహిళ రోజుకు 7 జతలు కుట్టి తమకు అందిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మహిళా కమిటీలు చేపట్టామని, త్వరలో మహిళా పాలసీ చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మండలంలో కుట్టు మిషన్లు అందించడం జరుగుతుందన్నారు. ఇకపై ప్రతి పనిలో మహిళా సంఘాలకు చేయూత కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కుట్టు పని 74 శాతం పూర్తి చేసినందుకు మహిళలను, జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, జాయింట్ కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఉన్నారు.