బూరుగడ్డ నల్ల చెరువుకు మళ్లీ గండి - నరకప్రాయంగా ప్రయాణం - Road Damage At Nallacheruvu - ROAD DAMAGE AT NALLACHERUVU
Published : Sep 22, 2024, 4:45 PM IST
Road Damage At Burugadda Nallacheruvu : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డ నల్ల చెరువు కట్టకు మళ్లీ గండిపడింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు కట్ట తెగి రోడ్డు కొట్టుకుపోయి బూరుగడ్డ, కరక్కాయల గూడెం, హుజూర్‌నగర్ ప్రాంతాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. తెగిన చెరువు కట్టను, రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్థానికులు జిల్లా యంత్రాంగం, కాంట్రాక్టర్లను కోరారు. కానీ ఇప్పటివరకు బూరుగడ్డ నల్ల చెరువు కట్ట పనులు పూర్తి కాకపోగా, శనివారం రాత్రి కురిసిన వర్షాలకు మళ్లీ గండిపడింది.
పనులను ఎందుకింత నాణ్యతాలోపంగా చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినిత్యం బూరుగడ్డ, కరక్కాయల గూడెం ప్రజలకు హుజూర్‌నగర్ రానిదే పనులు జరగవు. ఇప్పుడు మళ్లీ చుట్టూ తిరిగి ఈ ప్రాంతానికి చేరుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ఈ నల్ల చెరువుపై దృష్టి పెట్టి గండి పూడ్చివేత పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నాణ్యతా లోపం జరగకుండా చూడాలని కోరుతున్నారు.