ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టిన బైక్ - అతి వేగానికి ఇద్దరు బలి - ROAD ACCIDENT IN CHITTOOR - ROAD ACCIDENT IN CHITTOOR
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 19, 2024, 9:55 AM IST
Road Accident in Chittoor District : చిత్తూరు జిల్లాలో ఘెర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ను బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు పాలిటెక్నిక్ విద్యార్థులు మరణించారు. మరొకరు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం కుప్పం పట్టణం చెరువు కట్ట సమీపంలోని కూడలి వద్ద చోటు చేసుకుంది. ప్రమాదంలో ఆనందబాబు (17), మంజు (17) చనిపోగా, పునీత్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు ముగ్గురు కుప్పం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నారు.
వీరు ముగ్గురు కలిసి పలమనేరు వైపు వెళ్లి కుప్పంకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే పట్టణంలోని చెరువు కట్టకూడలి వద్దకు రాగానే వేగాన్ని నియంత్రించలేక కూడలి రోడ్డు దాటుతున్న ట్రాక్టర్ను ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో ఆనందబాబు అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మంజు అనే వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. పునీత్ తీవ్ర గాయాలతో కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాద దృశ్యాలు సమీప సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్థారించారు.