జగ్గయ్యపేటలో అద్దె బస్సుల యజమానుల ఆందోళన - మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హామీతో విరమణ - Rental Bus Owners Strike - RENTAL BUS OWNERS STRIKE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 3, 2024, 2:28 PM IST
Rental Bus Owners Strike in Jaggayyapeta : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట బస్ డిపోలో అద్దె బస్సుల యజమానులు ఆందోళన చేపట్టారు. ముందస్తు సమాచారం లేకుండా పలు అద్దె బస్సుల సమయాలను మార్చడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు అనుకూలంగా ఉండే సమయ వేళలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంక్రాంతి నుంచి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడం లేదని వాపోయారు. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ లేదనే సాకుతో కొందరికి బస్సులు తిప్పేందుకు అనుమతి ఇవ్వడం లేదని యజమానులు ఆరోపించారు.
Minister Ramprasad on Rental Bus Owners Strike : సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని అద్దె బస్సుల యజమానులు స్పష్టం చేశారు. దీంతో విజయవాడ - జగ్గయ్యపేట, జగ్గయ్యపేట - కోదాడ మధ్య పలు ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు సర్వీసులు నిలిచిపోయాయి. ఫలితంగా సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయంపై రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అధికారులతో మాట్లాడారు. యజమానులతో చర్చలు జరిపి వెంటనే సమస్య పరిష్కరించాలని ఆయన సూచించారు. మంత్రి ఆదేశాల మేరకు ఆపరేషన్స్ ఈడీ వారితో చర్చించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ హామీతో అద్దె బస్సుల యజమానులు ఆందోళన విరమించారు.