వన్యప్రాణులను వేట కోసం నాటు బాంబులు, తుపాకులు - సీజ్ చేసిన అధికారులు
Published : Feb 13, 2024, 2:07 PM IST
Police Seized Bombs in Kamareddy : వన్య ప్రాణులను రక్షించడానికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా ఫలితం లేకుండా పోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొందరు జంతువులను వేటాడుతూనే ఉన్నారు. తాజాగా కామారెడ్డిలో వన్యప్రాణులను చంపేందుకు తీసుకువచ్చిన నాటు బాంబులు కలకలం రేపాయి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని రాంపూర్ గడ్డకు చెందిన వల్లెపు హనుమంతు అటవీ జంతువులను వేటాడుతున్నాడని అధికారులకు సమాచారం రావడంతో వారు సోదాలు నిర్వహించారు.
తనిఖీలకు వచ్చిన అధికారులను చూసి హనుమంతు పారిపోయాడు. అనుమానం వచ్చి అతడి గురించి గ్రామస్థులను ఆరా తీసి, చివరకు అతడి ఇల్లును కనిపెట్టారు. వెంటనే అతడి ఇంట్లో సోదాలు నిర్వహించగా రెండు తుపాకులు, 15 నాటు బాంబులు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. వాటి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అటవీశాఖ అధికారులు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితునిపై కేసు నమోదు చేశారు. హనుమంతును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.