చంద్రబాబుపై 24, లోకేశ్‌పై 23 కేసులు - అత్యధికంగా వైసీపీ హయాంలోనే ! - Cases on Tdp leaders - CASES ON TDP LEADERS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 18, 2024, 9:09 AM IST
Police Cases on TDP Leaders : తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై 24 కేసులు, లోకేశ్‌పై 23 కేసులు ఉన్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. వీటిలో అత్యధికం వైసీపీ ప్రభుత్వ హయాంలోనే నమోదు చేసినవని తెలిపారు. నామినేషన్ పత్రాల్లో అభ్యర్థులపై ఉన్న కేసుల వివరాలను పొందుపరచాల్సి ఉన్నందున తెలుగుదేశం న్యాయ విభాగం చంద్రబాబు, లోకేశ్‌లతో పాటు, ఆ పార్టీ అభ్యర్థులపై ఉన్న కేసుల సమాచారాన్ని సేకరించింది.
చంద్రబాబుపై ఉన్న మొత్తం కేసుల్లో తొమ్మిది సీఐడీ పెట్టింది. రాజధానిలో ఎసైన్డ్ భూములు, ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్ మెంట్, రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు, మద్యం, ఇసుక వంటి అంశాల్లో చంద్రబాబుపై సీఐడీ గత ఐదేళ్లలో ఈ కేసులు బనాయించింది. మిగతా కేసులు వివిధ జిల్లాల్లో నమోదయ్యాయి. లోకేశ్‌పై నమోదైన 23 కేసుల్లో రెండు సీఐడీ పెట్టింది. యువగళం పాదయాత్రలో ఆయనపై పోలీసులు ఎక్కువ కేసులు పెట్టారు. తమ పార్టీ నాయకులపై ఎక్కడెక్కడ కేసులున్నాయో తెలుసుకునేందుకు డీజీపీ కార్యాలయంతోపాటు, అన్ని జిల్లాల ఎస్పీలకు లేఖలు, సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసి తెలుగుదేశం వివరాలు సేకరించింది.