మెదక్ జిల్లా ఘన్పూర్లో పెద్ద చెరువుకు గండి - 200 ఎకరాల వరకు నీట మునిగిన వరి పంట - Pedda Cheruvu Cutoff In Medak - PEDDA CHERUVU CUTOFF IN MEDAK
Published : Sep 3, 2024, 6:53 PM IST
Pond Water Leak in Medak : రాష్ట్రంలో గత మూడ్రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండల కేంద్రంలో పెద్ద చెరువుకు గండి పడింది. దీంతో దాదాపుగా 200 ఎకరాల వరకు వరి పంట నీట మునిగింది. ఈ సందర్భంగా గండిపడ్డ పెద్ద చెరువును మెదక్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పరిశీలించారు. తెగిపోయిన ఘన్పూర్ పెద్ద చెరువు కట్టకు ఇసుక బస్తాలు వేసి నీటిని ఆపాలని, కట్టను పునరుద్ధరించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.
తక్షణమే నష్టపోయిన రైతులకు ఎకరానికి 30 వేల రూపాయలు పరిహారం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చెరువుకు బుంగ పడినప్పుడు ముందస్తు చర్యలు తీసుకొని ఉంటే ఇంత పెద్ద మొత్తంలో విపత్తు జరిగి ఉండేది కాదని మండిపడ్డారు. వర్షాలతో ఇంత నష్టం వాటిల్లితే కాంగ్రెస్ ప్రభుత్వం అవేమి పట్టించుకోకుండా ప్రతిపక్షాలను తిట్టడంలో మునిగిందని విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా వరద బాధితులను అదుకుందో అదేవిధంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.