'చెత్త కుంపటి మాపై పెడతారా?' - పరవాడ ఫార్మా సిటీ వ్యర్థాల నిల్వను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రజలు - Land fill in Tadi village
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 4:50 PM IST
Parawada Pharma City Waste storage: అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మా సిటీ వ్యర్థాల నిల్వ కోసం రాంకీ యాజమాన్యం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో గందరగోళం నెలకొంది. జిల్లాలోని తాడి గ్రామంలో ల్యాండ్ ఫిల్ నిర్మాణానికి సంబంధించి, రాంకీ యాజమాన్యం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఫార్మా వ్యర్థాలను ఇక్కడ నిల్వచేస్తే జిల్లా మొత్తం కాలుష్య కాసారంగా మారుతుందని, ప్రజాసంఘాలు, విపక్ష నేతలు గళమెత్తారు. ప్రజలు, జీవరాశులపై చెడు ప్రభావం పడుతుందంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు.
వ్యర్థాలతో వ్యాపారం చేసి, ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటారా అని నిలదీశారు. తాడి గ్రామస్థులతో కలిసి వారంతా ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారు. పరవాడలోని సంస్థకు సంబంధించిన కంపెనీ వ్యర్థాలు ఎక్కడున్నా ఇక్కడికి తరలించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఐదు జిల్లాల నుంచి వ్యర్థాలను ఇక్కడికి తరలించి వ్యాపారం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని బలిపెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే కాలుష్యంతో బాధపడుతున్నామని, మళ్లీ ఇంకో సమస్యను ముందుకు తీసుకువస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.