తుంగలోకి నిబంధనలు - స్థానికంగా లేకపోయినా ఓటర్ల జాబితాలో అజేయకల్లం, మేకతోటి సుచరిత పేర్లు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 28, 2024, 10:48 AM IST
Officials Violated Rules: బాపట్ల పట్టణంలో నిబంధనల పేరుతో స్థానికంగా ఉండట్లేదని ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల మద్దతుదారుల ఓట్లను అధికారులు తొలగించారు. అదే అధికార పార్టీ ప్రముఖులు, ఎమ్మెల్యేల విషయానికి వచ్చేసరికి నిబంధనలే లేవన్నట్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సీఎం వైఎస్ జగన్కు సన్నిహితుడుగా పేరొందిన అజేయ్ కల్లంను బాపట్లలోని 85వ పోలింగ్ కేంద్రంలో ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదై ఉన్నారు. కానీ ప్రస్తుతం ఆయన విజయవాడలో నివాసం ఉంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రముఖుడు కావడంతోనే ఆయన ఓటును అధికారులు తొలగించలేదనే విమర్శలు వస్తున్నాయి.
ప్రతిపాడు ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత బాపట్లలోని 70వ పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో ఓటరుగా ఉన్నారు. ఆమె ప్రస్తుతం గుంటూరులో ఉంటున్నారు. సుచరిత ఓటును సైతం తొలగించలేదు. మరోవైపు పర్చూరు నియోజకవర్గంలో స్థానికంగా ఉండటం లేదన్న కారణంతో టీడీపీ సానుభూతిపరులు, మద్దతు దారులకు చెందిన వేల ఓట్లను అధికారులు తొలగించిన విషయం విదితమే. తమకు కావలసిన వారికి, ప్రభుత్వంలో ముఖ్యులకు మాత్రం ఇలా స్థానికంగా నివాసం ఉండకపోయినా ఓట్లు ఎందుకు కొనసాగించారన్న విషయాన్ని అధికారులే చెప్పాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నారు.