టీడీపీలో ఉన్నామని తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు: కప్పిర భార్య రేవతి - Police Arrested Kappira Srinivas - POLICE ARRESTED KAPPIRA SRINIVAS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 2, 2024, 3:42 PM IST
Nellore Police Arrested TDP Leader Kappira Srinivas: నెల్లూరులో తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు కప్పిర శ్రీనివాసులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలతో కప్పిరను ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భారీగా స్టేషన్కు తరలివెళ్లారు. గతంలో జరిగిన అల్లం నరేంద్ర అనే వ్యక్తి హత్య కేసులో కప్పిర శ్రీనివాసులు నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని కప్పిరను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.
వైద్య పరీక్షల నిమిత్తం కప్పిరను స్టేషన్ నుంచి ఆసుపత్రికి తరలిస్తుండగా పోలీస్ వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు, కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న వారిని పక్కకు నెట్టేసి కప్పిరను ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టులో హాజరు పరచనున్నారు. తెలుగుదేశంలో ఉన్నామని తమపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కప్పిర భార్య రేవతి ఆరోపించారు.