'పోరాడి సాధించుకున్న హక్కును హరిస్తోన్న జగన్ ప్రభుత్వం - ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధం' - అంబేడ్కర్ జిల్లా రావులపాలెం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 22, 2024, 7:16 PM IST
Neglect of the Government in Implementing Reservations : ఎన్నో పోరాటాలు చేసి సాధించిన రిజర్వేషన్లను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుందని రాష్ట్ర జేఏసీ సభ్యుడు ఆకుల రామకృష్ణ మండిపడ్డారు. అంబేడ్కర్ జిల్లా రావులపాలెంలో ఆయన ఆధ్వర్యంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల రాష్ట్ర జేఏసీ ప్రతినిధుల రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తమ వర్గాల వారు రిజర్వేషన్ కోసం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కును ప్రభుత్వం అమలు చేయకపోవడంపై చర్చించారు.
కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు జనాభా ప్రతిపాదికన ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని ఆకుల రామకృష్ణ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఓటు అనే ఆయుధంతో ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గత ప్రభుత్వం తమకు 5 శాతం రిజర్వేషన్లు సౌకర్యం కల్పించిందని, ప్రస్తుత ప్రభుత్వం దానిని అమలు చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న తమ వర్గ జనాభాను లెక్కించి దామాషా పద్ధతి ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. ఈ నెల 28న విశాఖలో మరో రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.