మే నెల పింఛన్లు ఇళ్ల వద్దే ఇవ్వాలి - గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చిన కూటమి నేతలు - NDA Leaders Meet Governor
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 27, 2024, 9:40 PM IST
NDA Leaders Meet Governor on Pension Issue : మే నెల ఫించన్లను ఇళ్ల వద్దేనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఎన్డీఏ కూటమి నేతలు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పెన్షన్ పంపిణీ అంశంపై కూటమి నేతలు చేసిన విజ్ఞప్తిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ సమస్యపై తగు చర్యలు తీసుకుంటామని గవర్నర్ హామీ ఇచ్చినట్లు నేతలు వెల్లడించారు. నేరుగా ఇంటికి వెళ్లి పంపిణీ చేసే అవకాశం ఉన్న ప్రభుత్వ తప్పుడు నిర్ణయం వలన ఈ నెల ఫించన్ల పంపిణీలో 32 మంది వృద్ధులు చనిపోయారని గుర్తుచేశారు. ఇప్పటికైన మేల్కొని మే నెలలో సచివాలయ, అధ్యాపకులు, అంగన్వాడి సిబ్బంది ద్వారా నేరుగా ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని కోరామన్నారు.
జగన్ మోహన్ రెడ్డి, జవహర్ రెడ్డి కలసి పెన్షన్ పంపిణీపై కుట్ర పన్నారని ఆరోపించారు. వృద్ధుల ప్రాణాలు పోతే ప్రతిపక్షాలపై బురద చల్లాలని నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో వెలుగుచూసిన మరణాలు మే నెలలో కూడా పునరావృతం కావాలని వైసీపీ ప్రభుత్వం కోరుకుంటుందని తెలిపారు. మే నెలలో 1,2 తేదీలలో ఫించన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేసినట్టు కూటమి నేతలు వెల్లడించారు.