బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 8:24 AM IST
Nara Bhuvaneswari Nijam Gelavali Yatra: తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తలపెట్టిన 'నిజం గెలవాలి' యాత్ర వరుసగా 4రోజుల పాటు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో జరుగనుంది. గతంలో చంద్రబాబు అరెస్టు సమయంలో ఆందోళనతో చనిపోయిన కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. చంద్రబాబు అరెస్టుతో తీవ్ర మనోవేదనకు గురై మృతి చెందిన కుటుంబాలకు నారా భువనేశ్వరి అండగా నిలుస్తున్నారు. ఆమె ప్రతి కుటుంబాన్నీ కలుస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ఓదార్చుతున్నారు. ఈ నెల 30న రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. 31న దర్శి, కొండపి, కందుకూరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అలాగే ఫిబ్రవరి 1న కందుకూరు, ఉదయగిరి, నెల్లూరు నియోజకవర్గాల్లో, ఫిబ్రవరి 2న వెంకటగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు.
ఈ నెల 25న భువనేశ్వరి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో గుండెపోటుతో మృతి చెందిన రొక్కల రాణి కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అదే విధంగా చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నిరాహారదీక్ష చేస్తూ అస్వస్థతకు గురైన పెద్ద సత్తియ్యను పరామర్శించి రూ.20వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఆయా కుటుంబాల ఇళ్లకు వెళ్లి ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న భువనేశ్వరి ధైర్యం నింపారు. మానసికంగా, ఆర్థికంగా కుంగిపోతున్న తమ కుటుంబానికి ధైర్యం చెప్పి మమ్మల్ని ఆదుకున్నారని వారు తెలిపారు.