CM Review Meeting On Sand Supply And Directs Reforms : రాష్ట్రంలో ఇసుక డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా సరఫరా పెంచాల్సిందిగా సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇసుక లభ్యత, ధరలు, అక్రమ రవాణా, సరఫరా ఇతర ఫిర్యాదులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో సీఎం ఈ ఆదేశాలు జారీ చేశారు.
ఇసుక లభ్యత, పారదర్శకంగా సరఫరా, అక్రమాల నియంత్రణ వంటి అంశాలపై ముఖ్యమంత్రి మరోమారు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక లభ్యతను పెంచాల్సిందిగా సీఎం ఆదేశించారు. రవాణా, తవ్వకం వ్యయం భారం వినియోగదారులపై ఎక్కువగా పడకుండా చూడాలని సూచించారు. జిల్లాల్లో ఇసుక ధరల్ని పునః సమీక్షించాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు.
వారిని ఇబ్బందులు పెట్టొద్దు : జిల్లాల్లోని ఇసుక రీచ్ లలో పూర్తిస్థాయిలో ఇసుక తవ్వకాలపై చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లాస్థాయి శాండ్ కమిటీలు, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వ్యక్తిగత అవసరాల కోసం ఇసుక తీసుకెళ్లే వారిని ఇబ్బందులు పెట్టొద్దని మరోమారు అధికారులకు సూచనలు ఇచ్చారు. రీచ్ లలో స్వయంగా ఇసుక తవ్వి తీసుకెళ్లేందుకు అనుమతించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని సీఎం తెలిపారు. అలాగే ఇసుక ధరల్ని కట్టడి చేసేందుకు జిల్లా స్థాయిలో ధరల్ని పునః సమీక్షించాలని సూచించారు.
'మా గ్రామంలో ఇసుక రీచ్లు వద్దు' - వాహనాలకు అడ్డంగా బైఠాయించిన గ్రామస్థులు
ఇకపై IVRS ద్వారా ఫిర్యాదులు : స్థానిక ఇసుక రీచ్ ల వద్ద తవ్వకం కోసం నిర్దేశించిన రుసుము మాత్రమే వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ అంశంలో ఏమైనా ఫిర్యాదులు వస్తే సహించబోమని అధికారులకు తేల్చి చెప్పారు. ఇసుక పై ఖర్చు తగ్గేలా రవాణా, తవ్వకం వ్యయం అతి తక్కువగా ఉండేలా చూడాల్సిందిగా సూచించారు. ఇసుక సరఫరాపై ప్రజల నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునేలా ఆర్టీజీఎస్ ద్వారా ఐవీఆర్ఎస్(IVRS) కాల్స్ చేయాల్సిందిగా ఆదేశించారు. గురువారం నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రల నుంచి ఫిర్యాదులు, సూచనలు స్వీకరించాల్సిందిగా సీఎం సూచించారు.
మరోవైపు ఇసుక అక్రమ రవాణాకు అడ్డు కట్ట వేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిరంతరం సర్వెలెన్సు కెమెరాలతో అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల ద్వారా పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా చూడాల్సిందిగా స్పష్టం చేశారు. పోలీసులు జిల్లాల్లో జరిగే ఈ అక్రమ రవాణాపై నిరంతరం దృష్టి పెట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి అందే ఫీడ్ బ్యాక్ తో పాటు ఫిర్యాదులపై తదుపరి సమావేశంలో సమీక్ష చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రభుత్వం అవకాశమిచ్చినా సహకరమేదీ? - అధికారుల వైఖరితో ఇసుక కష్టాలు
MRPకి మించి మద్యం అమ్మితే 5 లక్షలు జరిమానా - రెండోసారి తప్పు చేస్తే లైసెన్స్ రద్దు