నాగార్జునసాగర్ డ్యామ్‌కు వరద ప్రవాహం - 22 గేట్లు తెరిచి నీటి విడుదల - Nagarjuna Sagar Gates Open - NAGARJUNA SAGAR GATES OPEN
Published : Aug 29, 2024, 12:15 PM IST
Nagarjuna Sagar Gates Open: నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి 2 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. 20 క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి స్పిల్‌వే ద్వారా 1లక్ష 62 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. సాగర్ కుడి, ఎడమ కాలువలకు కూడా సాగునీరు వెళుతోంది.
ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి 28 వేల క్యూసెక్కుల నీరు వెళుతుండగా, విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. సాగర్ మొత్తం నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిండింది. నాగార్జునసాగర్ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా అంతే మొత్తంలో నీరు నిల్వ ఉంది. సాగర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వ్యవసాయ భూములకు సాగునీటిని అందిస్తుంది. డ్యాం నుంచి విడుదలవుతున్న నీరు పాల పొంగులా ప్రవహిస్తూ చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. గేట్లు తెరవడంతో సాగర్ వద్ద పర్యాటకుల సందడి పెరిగింది.