టీడీపీ-జనసేనను పొత్తును విడదీయడం ఎవరి తరం కాదు : నాగబాబు - Nagababu
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 18, 2024, 2:52 PM IST
Nagababu Comments: టీడీపీ - జనసేన కూటమీపై అధికార పార్టీ చేస్తున్న కుట్రలపై ఆ పార్టీ నేత నాగేంద్రబాబు స్పందించారు. తెలుగుదేశం - జనసేన పొత్తును విడదీయడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం తండేవలసలో ఓ పార్టీ కార్యక్రమానికి నాగబాబు హజరైయ్యారు. ఈ క్రమంలో మీడియాతో ముచ్చటించిన ఆయన త్వరలో పవన్ కల్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటన ఉండవచ్చు అని నాగబాబు తెలిపారు. ఇరుపార్టీల అంగీకారంతోనే జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని నాగబాబు చెప్పారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు చాలా స్పష్టంగా, చక్కగా ముందుకు వెళ్తున్నారని వివరించారు. జగన్, పవన్ అంటే గిట్టని వాళ్లు ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి ఎన్నో మాట్లాడుతుంటారని అన్నారు. అంతే తప్పా ఏం లేదన్నారు. కొద్ది రోజులు పోతే పూర్తిగా ప్రజల్లో గందరగోళం ఏమి ఉండదని తెలిపారు. ప్రజల్లో కూటమిపై ఓ అవగాహన ఉందని వివరించారు. టీడీపీ - జనసేనను విజయవంతం చేయడానికే కృషి చేస్తామని వివరించారు. తాము తప్పకుండా విజయం సాధిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.