బాయ్స్ హాస్టల్లో నిద్రించిన ఎంపీ కలిశెట్టి- సౌకర్యాలపై ఆరా - MP Kalishetti at BC Boys Hostel - MP KALISHETTI AT BC BOYS HOSTEL
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 14, 2024, 1:31 PM IST
MP Kalishetti Appalanaidu at BC Boys Hostel: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజవర్గం లావేరు మండలంలోని మెట్టవలసలో ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నిద్రించారు. ఈనెల 12న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రణస్థలంలోని స్వగృహానికి చేరుకున్నారు. అక్కడ నుంచి తాను చదువుకున్న మెట్టవలసలోని బీసీ బాలుర వసతి గృహానికి రాత్రి పదిన్నర సమయంలో వెళ్లారు. వేసవి సెలవుల తర్వాత స్కూళ్లను, హాస్టల్స్‌ను తెరిచిన రోజే కలిశెట్టి హాస్టల్‌ను సందర్శించారు.
వసతి గృహంలో వార్డెన్ అమలు చేసిన మెనూ, పరిశుభ్రత, తాగునీరు, నిద్రించేందుకు ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి హాస్టల్లోనే ఎంపీ నిద్రించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తాను ఆరు నుంచి పదోతరగతి వరకు ఈ వసతి గృహంలోనే ఉంటూ స్థానిక జిల్లా పరిషన్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నానని చెప్పారు. ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి వాటిని బాగు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.