హైదరాబాద్‌లో పెట్టుబడుల విస్తరణకు అమెజాన్ సంస్థ సుముఖత - amazon investments in Hyderabad
Published : Aug 11, 2024, 12:38 PM IST
Minister Sridhar babu Meet With Amazon Officials : హైదరాబాద్‌లో పెట్టుబడుల విస్తరణకు అమెజాన్ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్, కంపెనీ బృందంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో తన డేటా సెంటర్‌ను విస్తరించి, మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ ప్రతినిధులు ఆసక్తి ప్రదర్శించారు.
ప్రపంచంలోనే అమెజాన్ కంపెనీకి చెందిన అతిపెద్ద కార్పొరేట్ భవనం హైదరాబాద్‌లో ఉందన్న ఆ సంస్థ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఆధారిత సేవలతో కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్‌ను ప్రారంభించే ఆలోచనతో ఉన్నట్లు మంత్రికి వివరించారు. హైదరాబాద్‌లో తమ క్లౌడ్ సదుపాయాలను మరింత విస్తరించే అవకాశాలపై చర్చలు జరిపారు. మరోవైపు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లను విస్తరణ పనులు కూడా వచ్చే ఏడాది నాటికి పూర్తి చేసి కార్యకలాపాలను పెంచాలని ఆ సంస్థ ప్రతినిధులను మంత్రి కోరారు. ఈ డేటా సెంటర్ల విస్తరణ పూర్తయితే అత్యాధునిక డేటా సెక్యూరిటీ, క్లౌడ్ సొల్యూష్స్ రంగాల్లో హైదరాబాద్ అగ్రస్థానానికి చేరుకుంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.