ఇక నుంచి ఆర్టీసీ బస్సులో బడికి - త్వరలోనే అందుబాటులోకి : మంత్రి పొన్నం - telangana school buses fitness
Published : Jul 24, 2024, 2:30 PM IST
School Buses Fitness in Telangana : పాఠశాల బస్సులకు ఫిట్నెస్ను తప్పనిసరి చేశామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బస్సుల్లో మెడికల్ కిట్, ఫైర్ సేఫ్టీ కిట్‌తో పాటు ఫోన్ నంబర్ ప్రదర్శించడాన్ని తప్పనిసరి చేస్తామని స్పష్టం చేశారు. పదిహేనేళ్లు పైబడిన బస్సులను తిరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పాఠశాల సమయాల్లో బస్సులను తిప్పేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. శాసనసభలో బస్సుల ఫిట్నెస్, స్కూల్ సమయాల్లో ఆర్టీసీ బస్సులు తిప్పడంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నం సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆయన వివరణ ఇచ్చారు.
ఆర్టీసీకి ప్రతి నెలా రూ.300 కోట్లు : ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.300 కోట్లు ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆర్టీసీకి కొత్త బస్సులు కొంటున్నామని వెల్లడించారు. ఆర్టీసీలో 3,035 మంది ఉద్యోగులను నియమిస్తున్నామన్నారు. పనిభారం పెరిగినా ఆర్టీసీ కార్మికులు బాగా పనిచేస్తున్నారని వివరించారు. ఆర్టీసీ కార్మికులను అభినందిస్తున్నామని తెలిపారు.