మేడిగడ్డ బ్యారేజీ వద్ద స్వల్పంగా తగ్గిన వరద ప్రవాహం - Flood Flow At Medigadda barrage
Published : Jul 23, 2024, 2:27 PM IST
Flood Flow at Medigadda Barrage : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం స్వల్పంగా తగ్గింది. విస్తారంగా కురిసిన వర్షాల నేపథ్యంలో భారీగా వరద ప్రవాహం కొనసాగింది. బ్యారేజీకి 9 లక్షల 2 వేల 500 క్యూసెక్కుల మేర ప్రవాహం ఉండగా, ప్రస్తుతం 8 లక్షల 52 వేల క్యూసెక్కులకు తగ్గింది. 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారం బ్యారేజీకి 16 వేల 800 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో 66 గేట్లు ఎత్తి అదే స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగడంతో పుష్కర ఘాట్లను తాకుతూ 11.69 మీటర్ల మేర ఉండగా, ప్రస్తుతం ఒక మీటర్ మేర తగ్గింది.
కాళేశ్వరం వద్ద నీటి మట్టం 103.68 మీటర్లకు చేరడంతో గోదావరి నది ఒడ్డున ఉన్న లోతట్టు గ్రామాలైన కుంట్లం, పాల్గుల, అన్నారం, చండ్రుపల్లి, మద్దులపల్లి, నాగేపల్లి, కాళేశ్వరం, పుస్కుపల్లి, మాజీద్‌పల్లి, మెట్‌పల్లి, పెద్దంపేట గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.