ఎందుకు కూల్చకూడదో చెప్పండి - మచిలీపట్నం వైఎస్సార్సీపీ కార్యాలయానికి నోటీసులు - Notice to YSRCP District Office
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 28, 2024, 12:34 PM IST
Machilipatnam Commissioner Notice to YSRCP District Office : మచిలీపట్నంలో నిర్మించిన వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయానికి మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి నోటీసులు అందించారు. అక్రమ కట్టడాన్ని ఎందుకు కూల్చకూడదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా వైఎస్సార్సీపీ కార్యాలయ భవనం నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కార్యాలయం రాజ భవనాన్ని తలపించే విధంగా నిర్మించారు. ఈ భవనం నిర్మించేందుకు మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అనుమతులు తీసుకోలేదని అధికారులు తెలిపారు.
ఇప్పటికే చాలా చోట్ల నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వైఎస్సార్సీపీ కార్యాలయాలపై వివరణ కోరుతూ అధికారులు నోటీసులు జారీ చేశారు. విజయవాడ విద్యా ధరపురంలో నిర్మాణ దశలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయానికి కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నోటీసులు ఇచ్చారు. వైఎస్సార్సీపీ నేతలు బాధ్యులెవరూ అందుబాటులో లేకపోవడంతో అధికారులు భవనాలకు నోటీసులు అంటిస్తున్నారు.