లద్ధాఖ్ ప్రమాదం - విజయవాడకు చేరుకున్న జవాన్ల పార్థివ దేహాలు - Ladakh Tank Accident
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 1, 2024, 5:49 PM IST
|Updated : Jul 1, 2024, 6:21 PM IST
Ladakh Tank Accident: లద్దాఖ్‌లో శనివారం జరిగిన ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు భారత జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. గ్వాలియర్ నుంచి ప్రత్యేక ఎయిర్‌ఫోర్స్ విమానంలో సుభాన్ ఖాన్(బాపట్ల జిల్లా ఇస్లాంపూర్), సాదరబోయిన నాగరాజు(కృష్ణా జిల్లా పెడన), ఆర్. కృష్ణారెడ్డి(ప్రకాశం జిల్లా గిద్దలూరు)ల పార్థివదేహాలు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తరఫున మేజర్ దీపక్ శర్మ నివాళులు అర్పించారు. అదే విధంగా ఆర్మీ ఉన్నతాధికారులు బ్రిగేడియర్ వెంకట్ రెడ్డి, లెఫ్టినెంట్ కల్నల్ సందీప్ యాదవ్, తదితరులు జవాన్లకు గౌరవ వందనం చేసి పుష్పాలతో నివాళులర్పించారు. అనంతరం రోడ్డు మార్గంలో వారివారి స్వగ్రామాలకు జవాన్ల భౌతికకాయాలను ప్రత్యేక ఆర్మీ వాహనాల్లో తరలించారు.
కాగా లద్దాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో ఐదుగురు సైనికులు మృతి చెందారు. సైనిక విన్యాసాల్లో భాగంగా నది దాటుతుండగా వరదలు సంభవించాయి. వాస్తవాధీన రేఖ సమీపంలో టి-72 యుద్ధ ట్యాంకులో వెళుతున్నప్పుడు లేహ్‌కు 148 కిలోమీటర్ల దూరంలో శనివారం మంచు కరిగి శ్యోక్ నదికి వరదలు వచ్చి ట్యాంకు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురి మృతదేహాలను అధికారులు వెలికి తీశారు.