రైతులతో బీఆర్ఎస్ అధినేత మాటామంతి - సర్కార్‌పై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపు - KCR Bus Yatra in Telangana - KCR BUS YATRA IN TELANGANA
Published : Apr 24, 2024, 7:41 PM IST
KCR Met With Farmers at Nalgonda : బస్సు యాత్ర, రోడ్ షోల ద్వారా సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ్టి నుంచి ఉద్ధృతం చేశారు. అందులో భాగంగానే మిర్యాలగూడకు పయనమైన గులాబీ దళపతి, మార్గమధ్యలో నల్గొండ ఆర్జాలబావి వద్ద కాసేపు ఆగి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. అన్నెపర్తి వద్ద సుమారు ఐదు నిమిషాల పాటు ఆగిన కేసీఆర్, అక్కడి రైతులతో విద్యుత్, నీటి సమస్య, పంటల నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు.
BRS Chief KCR Bus Yatra in Telangana : ఈ సందర్భంగా పలువురు రైతులు కేసీఆర్‌తో మాట్లాడుతూ, గత ఇరవై రోజుల నుంచి కల్లాల్లో ఒడ్లుపోసుకొని కూర్చున్నామని, ధాన్యం మాత్రం కాంగ్రెస్ సర్కార్ కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగటానికి నీళ్లు కూడా రావడం లేదని సమస్యలు వెళ్లడించగా, రైతును దగ్గరకు పిలిచి మీ తరుఫున పోరాటం చేస్తున్నాం, రైతులందరూ సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాడుదామని చెప్పారు. బీఆర్ఎస్ పాలన బాగుండేదని గుర్తుచేసుకున్న కర్షకులు, మీరు(కేసీఆర్) ఉన్నప్పుడే బాగుంది సర్, మళ్లీ మీ పాలనే రావాలని గట్టిగా నినాదాలు చేశారు. అనంతరం కేసీఆర్ మిర్యాలగూడెం బస్సు యాత్రకు వెళ్లారు.