మంథనిలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం : శ్రీధర్‌బాబు - Minister Sridhar Babu Inaugurates
Published : Sep 14, 2024, 2:57 PM IST
IT Minister Sridhar Babu Opening Software Company in Manthani : పెద్దపల్లి జిల్లా, మంథనిలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న తరుణంలో ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాలని మహిళ సంఘాలను కోరారు. మహిళా సంఘాలకు రూ.20 కోట్ల రుణాల చెక్కులను పంపిణీ చేసిన మంత్రి, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మంథనిలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించి, అభివృద్ది చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
ఈక్రమంలోనే మంథని ప్రభుత్వ హాస్పిటల్లో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించి, సుమారు రూ. 14కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీలకు పనులు అప్పగించడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగయ్యాయని, అంతేకాకుండా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందన్నారు. రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ మూడు దఫాలుగా చేశామని, సాంకేతిక కారణాలతో రుణమాఫీ కానీవారికి తప్పకుండా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు మొదట ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సంకల్పించి పనిచేస్తుందని పేర్కొన్నారు.