కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై రాహుల్ బొజ్జా, ఇఎన్‌సీ మురళీధర్ మీడియా సమావేశం
Published : Feb 2, 2024, 5:30 PM IST
|Updated : Feb 2, 2024, 6:03 PM IST
Irrigation Secretary media conference on handover of projects to Krishna Board : శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన ఔట్ లెట్ల నిర్వహణను ఇక నుంచి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చేపట్టనుంది. బోర్డు ఛైర్మన్ అధ్యక్షతన నిన్న హైదరాబాద్ జలసౌధలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దిల్లీలో ఇటీవల కేంద్ర జల వనరుల శాఖ(Central Water Resources Department) కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశానికి కొనసాగింపుగా, కేఆర్ఎంబీ ఛైర్మన్ శివనందన్ కుమార్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్‌లతో సమావేశమయ్యారు. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు సంబంధించిన 15 ప్రాధాన్య ఔట్‌లెట్లను బోర్డుకు స్వాధీనం చేసేందుకు ఆపరేషన్ ప్రొటోకాల్స్ ఖరారు, కార్యాచరణ ప్రణాళికపై సమావేశంలో చర్చించారు. కృష్ణా జలాల విషయంలో తమ వాదనను తెలంగాణ ప్రభుత్వం మరోమారు వినిపించింది. ట్రైబ్యునల్ ద్వారా తుది కేటాయింపులు జరగాలని, అప్పటి వరకు 811 టీఎంసీల్లో చెరి సగం వాటా కావాలని, శ్రీశైలంలో నీటి మట్టం, తాగునీటి వినియోగం తదితరాలను ఈఎన్సీ మురళీధర్ వివరించారు. నిన్నటి సమావేశం వివరాలను నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇఎన్‌సీ మురళీధర్ మీడియాకు వివరిస్తున్నారు.