అటవీ భూముల్లో మట్టి మాయం- అధికారులకు కనిపించని అక్రమం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 25, 2024, 1:04 PM IST
Illegal Soil Mining In Eluru District : ఏలూరు జిల్లాలో వైెఎస్సార్సీపీ నాయకుల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. జిల్లాలోని ఉంగుటూరు మండలం గోపీనాథపట్నం సమీపంలోని అటవీ భూముల్లో యథేచ్చగా అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ మట్టిని ఓ వ్యవసాయ భూమిలో గుట్టలుగా పోశారు. స్థానిక వైసీపీ నాయకుడు, గ్రామస్థాయి ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలోనే ఈ మట్టి తవ్వకాలు జరగుతున్నాయని సమాచారం. అటవీశాఖ అధికారులకు తెలిసినా తవ్వకాలు ఆపడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లెేకున్నా ప్రకృతి సంపదను ఇష్టారీతిన దోచుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ అండతో అధికారులను ప్రలోభపెట్టి భారీ యంత్రాలతో అక్రమంగా కొండలను తవ్వుతూ మట్టిని తరలిస్తున్నారు. తమ గృహావసరాలకు ఎడ్ల బండ్లతో కొద్దిపాటి మట్టిని తరలిస్తున్నప్పుడు అడ్డుకున్న రెవెన్యూ, మైనింగ్, విజిలెన్స్ అధికారులకు ఇంత పెద్ద అక్రమం కనిపించడం లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అనుమతులు లేవని అప్పుడు గుర్తుకు వచ్చిన అంశం, ఇప్పుడు గుర్తుకు రావడం లేదా అని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమార్కులు మట్టిని తరలించకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.