తహశీల్దార్ కార్యాలయంలో అక్రమ పట్టాల తయారీ- బట్టబయలు చేసిన టీడీపీ నేత - Illegal Pattas in Anaparthi
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 25, 2024, 7:45 PM IST
Illegal Pattas Preparation in Tahsildar Office: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ ఆధ్వర్యంలో గట్టుచప్పుడు కాకుండా తయారుచేస్తున్న అక్రమ పట్టాల వ్యవహారాన్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పార్టీ నాయకులతో కలిసి బట్టబయలు చేశారు. స్థల సేకరణ చేయకుండా పట్టాలు ఎలా సిద్ధం చేస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు ఓటర్లను తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి ఆదేశాల మేరకు రెండు వేల దొంగ పట్టాలను డీటీ తయారు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు గ్రామాలకు భూసేకరణ అని డీటీ చెబుతున్నారని, మరి 11 గ్రామాల ప్రజలకు పట్టాలు తయారు చేస్తూ ప్రజలను వంచిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయడంలో స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి సీఎం జగన్ను మించిపోతున్నారని ఆరోపించారు. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ జరిపి డీటీపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.