ఐఐటీ హైదరాబాద్‌లో అంబరాన్నంటిన 'ఎలాన్ ఇన్వెన్షన్' సంబురాలు - ఫోక్ డ్యాన్స్, ఫ్యాషన్ షోలతో విద్యార్థుల ఉర్రూతలు - IIT Hyderabad Annual Fest
Published : Mar 17, 2024, 8:58 PM IST
IIT Hyderabad Annual Fest : ఐఐటీ హైదరాబాద్‌లో "ఎలాన్ ఇన్వెన్షన్" సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఫోక్ డ్యాన్స్, ఫ్యాషన్ షో వంటి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వార్షికోత్సవానికి కళాశాల పూర్వ విద్యార్థులు సైతం హాజరై, తమ అనుభవాలు పంచుకున్నారు. విద్యార్థులకు వివిధ రంగాల్లో పోటీలు నిర్వహించి నగదు బహుమతులు అందజేశారు.
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో "ఎలాన్ ఇన్వెన్షన్" పేరుతో విద్యార్థులు ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏటా జరిగే ఈ కార్యక్రమాన్ని కళాశాలలో చదువుతున్న విద్యార్థులే జరుపుతుంటారు. నిత్యం తరగతి గదుల్లో తీరిక లేకుండా గడిపే విద్యార్థులు, ఈ వార్షిక దినోత్సవాన ఎంతో ఉల్లాసంగా గడుపుతుంటారు. దీనికి నిర్వహణ కోసం 6 నెలల ముందు నుంచే నివేదిక తయారు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న పూర్వ విద్యార్థులను ఈ "ఎలాన్ ఇన్వెన్షన్"కు ఆహ్వానించారు. రాష్ట్రంలోని ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ సంస్థల నుంచి విద్యార్థులు వచ్చి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఫోక్ డ్యాన్స్, ఫ్యాషన్ షో వంటి కార్యక్రమాలు నిర్వహించారు. టెక్నాలజీకి సంబంధించిన విద్యార్థులు వివిధ రకాల రోబోలు తయారు చేసి వాటిని పోటీల్లో ఉంచారు.
ఎలాన్ ఇన్వెన్షన్లో చివరి రోజు కావడంతో విద్యార్థులు భారీగా చేరుకుని, పోటీల్లో పాల్గొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు వసతి కల్పించారు. విద్యార్థులే ఇలాంటి వార్షికోత్సవాలు నిర్వహించడం ద్వారా వినూత్న ఆవిష్కరణల గురించి తెలుసుకొని, మరింత విజ్ఞానాన్ని సంపాదించగల్గుతారని అధ్యాపకులు చెబుతున్నారు.