అమెరికాలో హైదరాబాదీ యువకుడిపై దాడి - సెల్‌ఫోన్, డబ్బులు లాక్కొని పరారైన దుండగులు - అమెరికాలో హైదరాబాదీ యువకుడిపై దాడి
Published : Feb 6, 2024, 10:37 PM IST
Hyderabad Youth Attacked in America : అమెరికాలోని షికాగో నగరంలో హైదరాబాద్‌కు చెందిన యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బాధితుడు లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన సయ్యద్గా గుర్తించారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన యువకుడు, ఇండియన్ వెస్లీ యూనివర్సిటీలో మాస్టర్ చదువుతున్నాడు. తన ఇంటికి సమీపంలో ఉన్న హోటల్‌కు వెళ్లి ఆహారం తీసుకుని వస్తుండగా ముగ్గురు దుండగులు అతన్ని వెంబడించి, రక్తం వచ్చేలా తీవ్రంగా గాయపరిచారు.
అనంతరం అతని దగ్గర ఉన్న సెల్‌ఫోన్, డబ్బులను లాక్కొని పరారైనట్లు సమీపంలోనున్న సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. దీనిపై హైదరాబాద్‌లోని లంగర్ హౌస్ పోలీసులను ఆరా తీయగా వారికి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు పరిపాటిగా మారుతుండటంతో, విదేశీ చదువులంటేనే యువతలో ఏదో తెలియని గుబులు చెలరేగుతుంది. తల్లిదండ్రులు సైతం భయాందోళనలకు గురవుతున్నారు.