బుడమేరు వరదలో వాహనాలు - పెద్ద సంఖ్యలో నీటమునిగిన కార్లు! - Vehicles Stuck in Flood Water
Published : Sep 3, 2024, 8:22 PM IST
Vehicles Stuck in Flood Waters in Krishna District : తెలుగు రాష్ట్రాల్లో ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలు, ఆ తరువాత వచ్చిన వరదలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. వరుణుడు కాస్త శాంతించినా, వరద ఉద్ధృతి మాత్రం ఇంకా తగ్గలేదు. ఇరు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ, ఖమ్మం జిల్లాల్లో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు రోజులుగా వేలమంది జనం వరద ముంపులోనే చిక్కుకుపోయున్నారు. అంతేకాక చాలా వరకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది.
ఈ క్రమంలోనే భారీ వర్షాలకు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ముస్తాబాద్‌లోని స్టాక్‌యార్డులు జలమయం అయ్యాయి. బుడమేరు వరద ఉద్ధృతి ప్రభావానికి పెద్ద సంఖ్యలో మోటారు వాహనాల షోరూంలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. టాటా మోటార్స్ స్టాక్‌యార్డులోని కార్లు, ఆటోలు, లారీలు నీట మునిగిపోయాయి. వరద కొంచెం తగ్గుముఖం పట్టడంతో వెహికల్స్ బయటకు కనిపిస్తున్నాయి. వాహనాలకు భారీ నష్టం వాటిల్లినట్లు సంబంధిత యాజమాన్యాలు చెబుతున్నాయి.